దేశ భద్రత అంశంపై నిఘా, సైనిక దళాధిపతులు ప్రధానమంత్రి కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు ప్రస్తుతం సరిహద్దుల్లోని పరిస్థితులపై, తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు.
దేశభద్రతపై రాజ్‌నాథ్ సమీక్ష..
ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశభద్రతపై సమీక్ష నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) సంచాలకులు రాజీవ్ జైన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా భద్రత కోసం తీసుకున్న చర్యలను రాజ్‌నాథ్‌కు వివరించారు.
దాడులు..ప్రతిదాడులు..
భారత్ జరిపిన మెరుపు దాడులకు ప్రతిగా పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకు వచ్చి దాడులు చేశాయి. దీటుగా స్పందించిన భారత వాయుసేన జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ వద్ద పాక్‌కు చెందిన 'పీఏఎఫ్ ఎఫ్-16' యుద్ధ విమానాన్ని కూల్చేసింది.