ప్రవాస భారతీయుల కోసం ఆన్లైన్ ఓటింగ్ సౌలభ్యం కల్పించలేమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరమని, ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదని ఎన్నికల సంఘం అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
పాత పద్ధతే..
విదేశాల్లో ఉండే భారతీయులు ముందుగా ఎన్నికల సంఘంలో తమ పేరు నమోదు చేసుకుని, ఓటింగ్ సమయంలో దేశానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 2019 లోనూ ఇదే విధానం కొనసాగనుంది.
భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం సుమారు 3కోట్ల10లక్షల మంది భారతీయులు వివిధ దేశాల్లో నివాసముంటున్నారు.
ప్రవాస భారతీయుల కోసం ఈ-ఓటింగ్ ప్రవేశ పెట్టాలనే విధానాన్ని గతంలో నిపుణలు కమిటీ తిరస్కరించింది. దీనికి బదులుగా ప్రాక్సీ ఓటింగ్ ప్రవేశ పెట్టాలని సూచించింది. దీనికి అనుగుణంగానే ప్రాక్సీ ఓటింగ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టింది కేంద్రం. లోక్సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో పెండింగ్లో ఉంది. ఒకవేళ ప్రస్తుత లోక్సభ కాలపరిమితి ముగిసేలోపు ఇది ఆమోదం పొందకపోతే విగిపోతుంది.
ప్రాక్సీ ఓటింగ్ అంటే:
ప్రాక్సీ ఓటింగ్ అంటే పరోక్ష ఓటింగ్. ఈ విధానంలో విదేశాల్లో ఉన్న వ్యక్తి తరపున ఇక్కడ ఉన్న వ్యక్తి ఓటు వేస్తాడు. ఈ వ్యక్తిని ప్రాక్సీ అంటారు. ప్రవాసులు సూచించిన గుర్తుకే ప్రాక్సీ ఓటేయాలి.