కశ్మీర్ వేర్పాటువాదులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 'జమాత్ ఏ ఇస్లామీ' అధినేత అబ్దుల్ హమీద్ ఫయాజ్ సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకుంది. సామాజిక మత సంస్థగా చెప్పుకుంటున్న 'జమాత్ ఏ ఇస్లామీ' గతంలో 'హిజ్బుల్ ముజాహిదీన్'కు మాతృసంస్థగా వ్యవహరించింది.
కశ్మీర్ బంద్...
ఈ అరెస్టుల నేపథ్యంలో 'జాయింట్ రెసిస్టెన్స్ లీడర్షిప్' (జేఆర్ఎల్) ఆదివారం కశ్మీర్ బంద్కు పిలుపునిచ్చింది. కశ్మీర్లోని వివిధ వేర్పాటువాద గ్రూపులన్నీ కలిసి ఏర్పాటుచేసుకున్నదే ఈ 'జేఆర్ఎఫ్'.
ముందు జాగ్రత్తగా
వేర్పాటువాదుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా శ్రీనగర్లో 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రజలు ముందు జాగ్రత్తగా నిత్యావసర సరుకులు, ఆహారపదార్థాలు కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. వాహనాల కోసం పెట్రోల్ సేకరించి ఉంచుకుంటున్నారు. వీరి కోసం చౌకధరల దుకాణాలను ఆదివారం కూడా తెరచే ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
యుద్ధ మేఘాలు
పుల్వామా ఘటన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 100 కంపెనీల పారామిలటరీ (పది వేల సైన్యం) దళాలను అదనంగా కశ్మీర్ లోయకు తరలించారు. యుద్ధ విమానాలు మోహరించారు. అయితే ఇవి సాధారణ విన్యాసాల్లో భాగమని సైనిక అధికారులు చెబుతున్నారు.
విపక్షాల ఆందోళన
వేర్పాటువాదులను నిర్బంధించడంపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలకు చట్టబద్ధత ఉందా అని ప్రశ్నించారు. కశ్మీర్లో భాజపా భాగస్వామ్య పక్షం పీపుల్స్ కాన్ఫెరెన్స్ సైతం ప్రభుత్వ చర్యల వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్యానించింది.