సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయంగా కీలకాంశమైన రఫేల్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోమారు విచారణ జరిపే అవకాశముంది. కేంద్రప్రభుత్వానికి సచ్ఛీలత పత్రం ఇస్తూ గతేడాది డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలన్న వ్యాజ్యాన్ని పరిశీలించి, విచారణకు స్వీకరించాలో లేదో నిర్ణయిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది.
రఫేల్ జెట్ విమానాల కొనుగోలులో ఎన్డీఏ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిదంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సహా మరికొందరు 4 వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇందులో మూడింటిని సుప్రీంకోర్టు కొట్టివేసింది. లోపం ఉందన్న కారణంతో ఒక వ్యాజ్యం అలానే పెండింగ్‌లో ఉంది. ఇప్పుడా పిటిషన్‌ను విచారించాలా లేదా అన్న అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
"రఫేల్‌పై 4 పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో ఒకదానిలో మాత్రమే లోపముంది. దీనిపై విచారణకు మరో ధర్మాసనాన్ని నియమించాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా కష్టమే అయినా మేం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం."
- జస్టిస్ రంజన్ గొగొయి, ప్రధాన న్యాయమూర్తి
రఫేల్ కేసులో కోర్టుకు సీల్డ్ కవర్లో తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని సిన్హా, శౌరి, భూషణ్ నేడు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.