జమ్ముకశ్మీర్ వాసులకు ప్రత్యేక హక్కులు కల్పించే 35ఏ అధికరణపై సుప్రీంకోర్టు విచారణకు ముందు లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమాతే ఇస్లామీ సభ్యులను శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. కశ్మీర్‌వ్యాప్తంగా సుమారు 150 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇందులో జమాతే ఇస్లామీ అధిపతి అబ్దుల్ హమీద్ ఫయాజ్ కూడా ఉన్నారు. జేకేఎల్ఎఫ్ అధ్యక్షుడు యాసిన్ మాలిక్‌నూ అదుపులోకి తీసుకున్నాయి బలగాలు.
ఇదంతా సాధారణమని పోలీసులు చెబుతున్నారు. అయితే... 1990 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తల్ని అదుపులోకి తీసుకోవటం ఇదే మొదటిసారన్నది అధికార వర్గాల మాట.
వేర్పాటువాద సంస్థయిన తెహ్రీక్-ఏ-హురియత్‌కు జమాత్-ఏ- ఇస్లామీ అనుబంధ సంస్థ.
జమాత్ ఖండన:
అరెస్టులను ఖండిస్తూ జమాత్ ప్రకటన విడుదల చేసింది. ఇలా అక్రమ నిర్బంధాలతో ఈ ప్రాంతంలో మరింత అనిశ్చితికి బలగాలు కారణమవుతున్నాయని ప్రకటనలో పేర్కొంది.
జమాత్ నాయకుల అరెస్టులను ఖండించారు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ.
హురియత్, జమాత్ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఏకపక్ష చర్యలకు ఎందుకు పాల్పడ్డారో అర్థం కావట్లేదు. ఇది కశ్శీర్‌లో అనిశ్చితిని పెంచినట్లే. వారిని ఏ ప్రాతిపదికన అదుపులోకి తీసుకున్నారో తెలపాలి. వ్యక్తులను ఆపగలరు కానీ భావాలను కాదు - మెహబూబా ముఫ్తీ , పీడీపీ అధ్యక్షురాలు
పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉన్నందున జమ్ముకశ్మీర్‌కు మరో 100 కంపెనీల పారామిలటరీ బలగాలను పంపింది కేంద్రం.