అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు స్థల వివాదం కేసును నేడు విచారించనుంది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని జస్టిస్ ఏఎస్ఏ బోబ్డే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది.
జనవరి 29నే ఈ కేసును విచారించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే సెలవుపై వెళ్లడం వల్ల అప్పుడు వాయిదా పడింది.
14 వ్యాజ్యాలపై విచారణ
2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో మొత్తం 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం.
అయోధ్య కేసును విచారించే రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యు.యు.లలిత్ స్వయంగా తప్పుకున్నారు. దీంతో జనవరి 25న మరోసారి అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని నియమించింది సుప్రీంకోర్టు. అలాగే ఆ ధర్మాసనం నుంచి జస్టిస్ ఎన్.వి.రమణను తప్పించారు. న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్ ధర్మాసనంలోకి వచ్చారు.