శారద కుంభకోణం కేసు విచారణను పశ్చిమబంగ అధికారులు అడ్డుకుంటున్నారని సీబీఐ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ కేసు విచారణ నుంచి స్వతహాగా తప్పుకున్నారు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు. పశ్చిమబంగ రాష్ట్రం తరఫున న్యాయవాదిగా ప్రాతినిథ్యం వహించినందువల్లే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది. వాదనలు వినేందుకు త్రిసభ్య ధర్మాసనంలోని సభ్యుల్లో ఒకరు సుముఖంగా లేరని తెలిపింది.
సోమవారం రోజున ఈ కేసుకి సంబంధించి పశ్చిమబంగ సీఎస్ మలయ్ కుమార్, డీజీపీ వీరేంద్ర కుమార్, అప్పటి కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సుప్రీంలో విడివిడిగా ప్రమాణపత్రాలను సమర్పించారు.
బెంగాల్ ప్రభుత్వం, పోలీసు అధికారులు సీబీఐని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఫిబ్రవరి 3న సరైన పత్రాలు లేకుండా కోల్కతా పోలీసు కమిషనర్ నివాసంలోకి సీబీఐ అధికారులు బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించినందు వల్లే అడ్డుకున్నామని సుప్రీంకు వివరణ ఇచ్చారు.