ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగతంగా దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం తేల్చిచెప్పింది.
మధ్యంతర బడ్జెట్‌కు ఎలాంటి రాజ్యాంగ నిబంధన లేదని న్యాయవాది మనోహర్‌లాల్ శర్మ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పూర్తి స్థాయి బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు మాత్రమే రాజ్యాంగం అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూలధన నిధికి సంబంధించి గతేడాది ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేశారు శర్మ. ఈ వ్యాజ్యం వేసినందుకు సుప్రీంకోర్టు శర్మపై ఆగ్రహం వ్యక్తంచేసింది. రూ. 50 వేలు జరిమానా విధించింది.