సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయంగా ప్రాధాన్యాంశమైన అయోధ్య కేసును రాజీ ద్వారా పరిష్కరించాలని చూస్తోంది సుప్రీంకోర్టు. ఇందుకోసం మధ్యవర్తిని నియమించే అవకాశంపై ఆలోచిస్తోంది. మధ్యవర్తి నియామకంపై మార్చి 5న తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. కేసు విచారణను అప్పటివరకు వాయిదా వేసింది.
అయోధ్య కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. మధ్యవర్తి నియామకంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటే ఆ దిశగా ప్రయత్నిస్తామని కోర్టు స్పష్టం చేసింది. రాజీకి ఒక్క శాతం అవకాశం ఉన్నా... మధ్యవర్తిని వెంటనే నియమిస్తామని ప్రకటించింది.
భిన్నాభిప్రాయాలు
మధ్యవర్తి నియామకానికి కొన్ని ముస్లిం సంఘాలు అంగీకారం తెలిపాయి. హిందూ సంస్థలు ముఖ్యంగా రామ్‌లల్లా విరాజ్మాన్ వంటివి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గతంలో చాలా సార్లు మధ్యవర్తిత్వం విఫలమైందని గుర్తు చేసింది రామ్‌లల్లా. అయితే కోర్టు మాత్రం వివాదం కన్నా సంబంధాల పునరుద్ధరణే లక్ష్యమని ప్రకటించింది.
"మాకు భూమి విషయంలో ఆందోళన లేదు. పరస్పర సంబంధాలు బాగుండాలనే మా ఆలోచన. నివేదికలకు సంబంధించి అన్ని పక్షాలకు అనువాద ప్రతులకు అనుమతిస్తున్నాం. వాటిపై మీ అభిప్రాయాలను తెలపండి."
-సుప్రీం ధర్మాసనం
అనువాద ప్రతుల వితరణ
కేసుకు సంబంధించిన నివేదికల అనువాద ప్రతులను అన్ని పక్షాలకు అందివ్వాలని రిజిస్ట్రీని సుప్రీం ఆదేశించింది. దీనిపై 8 వారాల్లోగా అభిప్రాయాలను తెలపాలని సూచించింది. విచారణ ప్రారంభమయ్యాక అభిప్రాయాలను స్వీకరించమని స్పష్టంచేసింది.
2017 డిసెంబర్లోనే అనువాద ప్రతులకు అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయని హిందుత్వ సంస్థలు తెలిపాయి. ఇదే విషయమై అభిప్రాయం తెలిపేందుకు ముస్లిం పక్షాలు రెండు నుంచి మూడు నెల సమయం కావాలని కోరాయి.
ఇదీ వివాదం
ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.