ఉగ్రవాదంపై భారత్-సౌదీ అరేబియా ఏకాభిప్రాయం వ్యక్తంచేశాయి. తీవ్రవాద సంస్థలు, వాటికి సహకరించే దేశాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించాయి.
భారత పర్యటనకు వచ్చిన సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్... ప్రధాని నరేంద్రమోదీతో దిల్లీలో సమావేశమయ్యారు. పుల్వామా దాడి నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో ఉగ్రవాదంపై పోరే ప్రధానాంశమైంది. మోదీ, సల్మాన్ సంయుక్తంగా నిర్వహించిన పత్రికా సమావేశంలోనూ ఇదే విషయం ప్రతిధ్వనించింది.
ఇదీ చూడండి:మసూద్‌పై ఫ్రాన్స్ గురి
పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండానే ఆ దేశం తీరును తప్పుబట్టారు ప్రధాని.
"పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి మానవ చరిత్రలో మరో క్రూరమైన చర్యగా మిగిలిపోతుంది. ఉగ్రవాదులు, వారికి మద్దతిచ్చే దేశాలపై అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. తీవ్రవాదుల మౌలిక వసతులను నాశనం చేయటం, వారికి మద్దతు నిలిచిపోయేలా చేయటం, వాళ్లందరినీ శిక్షించడం అవసరం. ఈ విషయంలో సౌదీ అరేబియా-భారత్ చర్చలు సంతృప్తికరంగా సాగాయి. ఉగ్రవాదం పోరు, సముద్రపరమైన రక్షణ, సైబర్ భద్రతపై రెండు దేశాలు మరింత కృషి చేసేందుకు అంగీకరించటం సంతోషకరం. "
- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి
తోడుగా ఉంటాం
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌కు పూర్తి మద్దతిస్తామని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. నిఘా సమాచార మార్పిడికి అంగీకరించామని తెలిపారు సల్మాన్.
కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి భారత్-సౌదీ అరేబియా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.