సోనియా అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
ఈ మూడు సంవత్సరాలలో చాలా నేర్చుకున్నాను. ఇదంతా వృధా కాదు.ఈ అనుభవాన్ని ఉపయోగిస్తాను. ఆరోపణలు, నిందలు అన్నీ తేలిపోయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలని నిశ్చయించుకున్నాను. కొన్ని సంవత్సరాల పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను. దేశంలో అన్ని ప్రాంతాల్లో పనిచేశాను, కానీ ఉత్తర్ ప్రదేశ్లో పనిచేసినప్పుడు మాత్రం ఇంకా సేవ చేయాలనిపించింది. నిజమైన ప్రేమాభిమానాలు నాకు ఈ ప్రాంతం నుంచే లభించాయి. -రాబర్ట్ వాద్రా
49 ఏళ్ల వాద్రా పై హవాలా కేసు నమోదైంది. ప్రస్తుతం దీనిపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. వాద్రా వీటిని ప్రభుత్వ కక్ష పూరిత చర్యలుగా పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ప్రభుత్వం కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తోందని వాద్రా ఆరోపించారు. అయితే ప్రజలకు నిజానిజాలు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు.
రాజస్థాన్లో ఈడీ కార్యాలయానికి విచారణ కోసం 8 సార్లు వెళ్లానని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లఘించడం లేదని వాటి ప్రకారమే విచారణకు హాజరవుతున్నానని ఆయన ప్రకటించారు.
చాలా సంస్థల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వాద్రా ఫేస్బుక్ పోస్టులో తెలిపారు. రాజకీయాల్లో పోటీ చేస్తానని గతంలోనూ వాద్రా ఫేస్బుక్ లో పోస్టు చేశారు.