ప్రముఖ హిందీ రచయిత నమ్వర్ సింగ్ మృతి చెందారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్లీలో మరణించారు. 92 ఏళ్లు వయసున్న నమ్వర్ను నెల రోజుల క్రితం ఎయిమ్స్‌లో చేర్పించారు కుటుంబసభ్యులు.
సాహిత్యంలో పీహెచ్డీ
నమ్వర్ సింగ్ 1926 జులై 28న ఉత్తరప్రదేశ్ వారణాసి సమీపంలోని జియాన్‌పూర్‌లో జన్మించారు. ఎమ్ఏ పట్టభద్రుడైన ఆయన హిందీ సాహిత్యంలో పీహెచ్డీ పుచ్చుకున్నారు. సాహిత్య విమర్శకుడిగానూ మంచిపేరు తెచ్చుకున్నారు నమ్వర్.
ప్రసిద్ధ రచనలెన్నో
బెనారస్, జోధ్‌ఫూర్, జవహార్‌లాల్ వర్సటీల్లో ఆచార్యులుగా పనిచేశారు నమ్వర్. "ఛాయావాద్", "ఇతిహాస్ ఔర్ ఆలోచన", "కహానీ నయీ కహానీ", "కవితా కె నయే ప్రతిమాన్", "దూసరీ పరంపరా కి కోజ్" లాంటి సుప్రసిద్ధ రచనలు చేశారు. 1971లో ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
ప్రధాని సంతాపం
సాహితీవేత్త మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. హిందీ భాషకు ఆయన ఎనలేని సేవ చేశారని కొనియాడారు.
నేడు మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీలోని లోథీ రొడ్డులో నమ్వర్ అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.