ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించినా ఆ ప్రతిఫలాలు రుణగ్రహీతలకు అందకపోవడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో చర్చలకు సిద్ధమయ్యారు గవర్నర్ శక్తి కాంతా దాస్. డిసెంబర్ వరకు 6.25గా ఉన్న వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించింది కేంద్ర బ్యాంకు. అయినప్పటికీ చాలా బ్యాంకులు దీనిని 0.05 శాతం మేర మాత్రమే తగ్గించాయి. దీంతో రుణగ్రహీతలకు పూర్తి ప్రతిఫలాలు అందకుండా పోతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఈ నెల 21న బ్యాంకు సీఈఓలతో భేటీ కావాలని నిర్ణయించారు శక్తి కాంతదాస్. ఈ సోమవారం జరిగిన బడ్జెట్ అనంతర సమావేశాల్లో ఈ కీలక ప్రకటన చేశారు శక్తి కాంతదాస్.
ఒకవేళ వచ్చే సోమవారం జరిగే చర్చలు సఫలమై బ్యాంకులు ఆర్బీఐ రేట్లను అమలు చేస్తే గృహ,వ్యక్తిగత రుణాలు సహా పలు రుణాలపై భారీగా వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.
బడ్జెట్ అనంతర సమావేశాల్లో ఆర్బీఐ బోర్డు సభ్యులతో పాటు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ పాల్గొన్నారు.
"వడ్డీ రేట్ల తగ్గింపు ఫలాలు రుణగ్రహీతలకు అందేలా చేయడం ముఖ్యమైన విషయం. ఇప్పటికే కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన సమావేశంలో కూడా దీన్ని స్పష్టం చేశాం. ఈ నెల 21 ఈ విషయం పై అన్ని బ్యాంకుల ప్రధాన కార్యదర్శలతో సమావేశమవుతాం. అలాగే ఆర్బీఐ ఇదివరలో చిన్న తరహా పరిశ్రమలకు ప్రకటించిన 25 కోట్ల రుణ పరిమితిని బ్యాంకులు అమలు చేయాలి. బ్యాంకులపై వస్తున్న ఫిర్యాదులను, పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం."
-శక్తి కాంతదాస్ , ఆర్బీఐ గవర్నర్
బ్యాంకుల విలీనంపై స్పందించారు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌జైట్లీ.
"భారత్ తక్కువ సంఖ్యలో పెద్ద బ్యాంకుల్ని కోరుకుంటోంది. గతంలో స్టేట్ బ్యాంకు, మహిళాబ్యాంకు విలీనం అనంతరం దేనా బ్యాంక్, విజయా బ్యాంకులను విజయవంతంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశాం. ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు అత్యవసరం."
-అరుణ్ జైట్లీ , కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి