" ఫిబ్రవరి 7న లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పంపించిన లేఖలో పేర్కొన్న డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసన తెలపడానికి 20న జైల్ భరో ప్రారంభిస్తాం. 21న ప్రధాన తపాలా కార్యాలయం ముందు నిరసనలు చేపడతాం. " - నారాయణ స్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి
ధర్నాపై స్పందించిన కిరణ్‌బేడీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. చట్టవిరుద్ధంగా ధర్నా చేపడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 21న అన్ని సమస్యలపై బహిరంగ సమావేశంలో చర్చిద్దామని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
2016 మేలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచీ ఆమెకు, సీఎం నారాయణ స్వామికి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.
ఇళ్లపై నల్ల జెండాలతో నిరసన
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికార కూటమి నాయకులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేసి నిరసనలు తెలిపారు. కిరణ్ బేడీ బెదిరిస్తున్నారని ఆరోపించారు నారాయణ స్వామి. భయపడేది లేదని తేల్చిచెప్పారు. అరెస్టులకూ సిద్ధమేనన్నారు.
కిరణ్ బేడీని వెనక్కి పిలిపించాలని లేఖలు
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని వెనక్కి పిలిపించాలని కోరుతూ పుదుచ్చేరి ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాయనున్నారు. ఈ మేరకు మంత్రులకు, అధికార కూటమి నాయకులకు ఆదేశాలు ఇచ్చారు నారాయణ స్వామి.
పర్యటన అర్ధంతరంగా ముగింపు
దిల్లీ పర్యటనలో ఉన్నందున ఈ నెల 20 వరకు పుదుచ్చేరికి రాలేనని గతంల చెప్పారు కిరణ్‌బేడీ. కానీ రాష్ట్రంలో పరిస్థితుల వల్ల పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని ఆదివారం తిరిగి వస్తున్నట్లు సమాచారం.
భారీగా పోలీసుల మోహరింపు
ముఖ్యమంత్రి ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా రాజ్‌నివాస్, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను భారీగా మోహరించారు.