రెండు రోజుల పర్యటన కోసం ఈ నెల 19న సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మొదటి సారి అధికార హోదాలో భారత పర్యటనకు రానున్నారు. సౌదీ రక్షణ శాఖ మంత్రి హోదాలో సల్మాన్ భారత్కు వస్తున్నట్లు భారత్లో సౌదీ రాయబారి సౌద్ మహమ్మద్ అల్ సతి తెలిపారు. సల్మాన్ పర్యటనతో వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి చరిత్రాత్మక అవకాశంగా మారనుందని పేర్కొన్నారు.
పుల్వామా ఉగ్రదాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించిందని అల్ సతి తెలిపారు. పుల్వామా ఘటన నేపథ్యంలో ఈ పర్యటనలో ఉగ్రవాద నిర్మూలన, రక్షణ అంశాలు ప్రధాన అజెండా కానుందని అన్నారు. వాటితో పాటు పెట్టుబడులు, రక్షణ శాఖ, భద్రత, పునరుత్పాదక శక్తి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రపతి, ప్రధానితో భేటీ
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భేటీ అవుతారు సల్మాన్. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా భారత్ వస్తున్న సల్మాన్... పాకిస్థాన్, మలేషియా, ఇండోనేషియాల్లోనూ పర్యటించనున్నారు.
సౌదీ అరేబియా భారత్కు నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. రెండు దేశాల మధ్య ఏటా 28 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. భారత్కు దిగుమతి అవుతున్న ముడి చమురులో 20 శాతం సౌదీ నుంచే వస్తోంది. సౌదీలో సుమారు 2కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు.