సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముహూర్తం దగ్గరపడింది. విజయమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపడానికి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి.
ఎన్నికల ముందు పొత్తులు సాధారణమే. ఈసారి మాత్రం మరింత ఆసక్తికరం. కారణం... మోదీ. విపక్షాలన్నింటి లక్ష్యం ఒకటే... మోదీని గద్దె దించడం. కానీ... ఆ పనిని ఏ ఒక్క పార్టీయో చేయలేదు. అందరూ ఏకం కావాలి. అందుకే... బద్ధశత్రువులైన పార్టీలు పొత్తు రాజకీయాలకు తెరలేపుతున్నాయి. ఫలితంగా... దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ కొత్త పొత్తులు పొడుస్తున్నాయి.
జాతీయస్థాయిలో మహాకూటమి...
2014 లోక్‌సభ ఎన్నికల ముందు వినిపించిన ఒకే ఒక పేరు నరేంద్రమోదీ. భాజపాకు విజయం సాధించి పెట్టిందీ ఈ నమో మంత్రమే. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన అనేక ఎన్నికల్లో నమో మంత్రం పనిచేసింది. భాజపాపై ఓట్ల వర్షం కురిపించింది.
కానీ... సార్వత్రిక ఎన్నికల ముంగిట పరిస్థితి తారుమారైంది. వరుస ఓటములు పార్టీని కలవరపెడుతున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది భాజపా.
ఇదే సరైన సమయమని భావించిన విపక్షాలు జాతీయస్థాయిలో 'మహాకూటమి' పేరుతో జట్టుకట్టాయి. మోదీని, భాజపాను ప్రశ్నించే ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదు. అన్ని పార్టీలు ఏకమై బహిరంగ సభలు, దీక్షలు వేదికగా... అధికార పక్షంపై విమర్శల దాడి చేస్తున్నాయి.
నేతలు ఒకటైనా... తేలాల్సిన లెక్కలెన్నో...
ఈసారి మహాకూటమిలో ఆసక్తికర అంశం... రాష్ట్రాలవారీ పొత్తులు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి పార్టీలు. సీట్ల పంపకం విషయంలోనూ అంతే.

మహాకూటమి వ్యూహాలను తిప్పికొట్టేలా... భాజపా ప్రతివ్యూహాలు రచిస్తోంది. పొత్తుకు పొత్తుతోనే సమాధానం అన్నట్లు వేర్వేరు రాష్ట్రాల్లో సరికొత్త స్నేహగీతాలు ఆలపిస్తోంది.
ఇలా... జాతీయ స్థాయి కూటములు, ప్రాంతీయ పొత్తులతో... ఎన్నికల వేళ 'పొత్తుల భారతం' మాట బాగా వినిపిస్తోంది.
ఉత్తర భారతంలో...
ఉత్తరాదిన కొత్త పొత్తులతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్... 80 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం. ఇక్కడ మెజార్టీ స్థానాలు గెల్చుకున్న పార్టీకే అంతిమంగా విజయావకాశాలు ఎక్కువ. పెద్ద రాష్ట్రంలో రాజకీయాలూ ఎక్కువే. భాజపా, కాంగ్రెస్‌తో పాటు ఎస్పీ, బీఎస్పీ, ఇతర స్థానిక పార్టీలూ ప్రభావం చూపిస్తాయి.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ప్రత్యర్థులుగా బరిలోకి దిగాయి. భాజపాకు కలిసొచ్చిందే ఇది. ఈసారి ఆ పరిస్థితి లేదు. బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్‌పార్టీ(బీఎస్పీ) ఇప్పటికే చేతులు కలిపాయి. ఎస్పీ, బీఎస్పీని మహాకూటమిలో చేర్చుకోవాలని విఫలయత్నాలు చేసింది కాంగ్రెస్. చివరకు... యూపీలో ఒంటరిగా బరిలోకి దిగింది.
మహాకూటమికి ఎస్పీ, బీఎస్పీ దూరంగా ఉండడం వెనుక భిన్న విశ్లేషణలు ఉన్నాయి. కలిసి పోటీచేస్తే కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అగ్రవర్ణాల ఓట్లు భాజపాకు మళ్లిపోయే అవకాశం ఉందన్న వాదనలు వినిపించాయి. అలా జరగడంకన్నా... విడివిడిగా బరిలోకి దిగి, ఫలితాల అనంతరం జట్టు కట్టడమే నయమన్నది కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఆలోచన అన్న ఊహాగానాలు వినిపించాయి.
బిహార్...
బిహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ భాజపాకు మిత్రపక్షం. ఇక్కడ కాంగ్రెస్‌తో ఆర్జేడీ, బీఎస్పీ, ఎస్పీలు పొత్తు కుదుర్చుకునే అవకాశముంది.
మహారాష్ట్ర...
రెండో అత్యధిక సంఖ్యలో లోక్‌సభ నియోజకవర్గాలున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ 40 స్థానాలుండగా భాజపా, శివసేన ఓ కూటమిగా...కాంగ్రెస్, ఎన్సీపీ మరో జట్టుగా ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి.

ఎప్పుడూ ఎన్డీఏకు మిత్రపక్షంగానే ఉంటూ విమర్శలు గుప్పించే శివసేన భాజపాతో పొత్తుకు ఇటీవలే సై అంది.
ఇక్కడ ఇతర ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తుపై సంప్రదింపులు జరుపుతున్నాయి. వీరి కలయికపై దాదాపు స్పష్టత వచ్చినా...కొన్ని స్థానాల మధ్య చర్చలు సాగుతున్నాయి. కొద్దికాలంగా రాజకీయాల్లో సన్నిహితంగా ఉంటున్న ఎన్సీపీ, కాంగ్రెస్ భాగస్వామ్యానికి పెద్దగా అవరోధాలు ఉండకపోవచ్చు.

దక్షిణాన ప్రాంతీయ పార్టీలే...
దక్షిణాదిన ఎప్పటినుంచో ప్రాంతీయ పార్టీలదే హవా. అధికారం దక్కించుకోవడానికి జాతీయ పార్టీలకు ఇక్కడ పొత్తే ఏకైక మార్గం. అందుకే శత్రువులు, విమర్శలు గుప్పించిన ప్రాంతీయ పార్టీలతోనూ కలవడానికి ప్రయత్నిస్తున్నాయి.
తమిళనాడు...
సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువు.. తమిళనాడు. ఇక్కడ 39 స్థానాల కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
అధినేత్రి జయలలిత మరణానంతరం ప్రధాన పార్టీ అన్నాడీఎంకేలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అంతర్గత కలహాలు... సీఎం పీఠం కోసం రాజకీయాలు... ఇలా ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇదే కొత్త పార్టీల ఏర్పాటుకు కారణమైంది. దినకరన్, కమల్‌హాసన్, రజనీకాంత్లూ పార్టీ పెట్టారు.
ఎన్నికల ముందు అన్నాడీఎంకే, డీఎంకే, భాజపా, కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకేలతో పాటు ఎన్నో పార్టీల మధ్య పొత్తులు కుదురుతున్నాయి.
తాజాగా అన్నాడీఎంకే, భాజపా, పీఎంకే మధ్య పొత్తు కుదిరింది. 39లో ఏడు స్థానాలు పీఎంకే, 5 స్థానాలు భాజపాకు కేటాయించింది ఏఐఏడీఎంకే.
డీఎంకే, కాంగ్రెస్ మధ్య స్నేహపూర్వక పొత్తుంది. సీట్ల పంపకాల కోసం ఈ రెండు పార్టీలు సంప్రదింపులు జరుపుతున్నాయి.
కర్ణాటక...
కర్ణాటకలో ఉన్న లోక్‌సభ స్థానాలు 27. ఇక్కడ రాజకీయాలకేం తక్కువలేదు. ఇటీవలి కన్నడ గడ్డలో జరిగిన పరిణామాలు దేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాయి.
శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం పొత్తు కుదుర్చుకుని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్-జేడీఎస్... సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే మైత్రిని కొనసాగించనున్నాయి.
ఇలా ఎన్నికల ముందు అంతా పొత్తుల మాటలే. సీట్ల లెక్కలే. ఈ రాజకీయ చదరంగంలో చివరకు ఎవరు విజేతగా నిలుస్తారో వేచిచూడాలి.