2014తో పోలిస్తే రాహుల్ కొంత మేర అభివృద్ధి చెందారని, ఆయన సోదరి ప్రియాంక కూడా ఇదే బాటలో ఉన్నప్పటికీ వీరు ప్రధాని మోదీకు ప్రత్యామ్నయం కాలేరని శివసేన పేర్కొంది.
రెండురోజుల క్రితం భాజపాతో శివసేన పొత్తు కుదుర్చుకొంది. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీకి మద్దతుగా ఈ ప్రకటన విడుదల చేసింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భాజపా విధానాలను, నాయకుల తీరును తీవ్రంగా విమర్శిస్తూ వస్తోన్న శివసేన ప్రస్తుతం కాంగ్రెస్ను విమర్శిస్తూ వస్తోంది.
సీట్ల సర్దుబాటు, పొత్తుపై విపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు స్పందించింది శివసేన పత్రిక సామ్నా. ప్రజల మనసుల్లో ప్రశ్నలు లేవని... కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కంగారు పడుతున్నాయంటూ వ్యాఖ్యానించింది. శివసేన, భాజపా సిద్ధాంతాలు వేరు అయినప్పటికీ రామ మందిర నిర్మాణం కోసం 2014లో జత కట్టామని సామ్నా పేర్కొంది.
పొత్తులపై వస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కంటే, మహరాష్ట్ర ప్రజలకు దీని ద్వారా కలిగే ప్రయోజనం గురించి చెప్పాలంటూ సామ్నా పత్రిక పేర్కొంది.
2014 కాంగ్రెస్ దాని భాగస్వామ్య పార్టీలపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, ఇదే సమయంలో మోదీ ప్రభంజనం సృష్టించారని , 2019 ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం కానుందని శివసేన జోస్యం చెప్పింది.
పొత్తు కుదిరి రెండు రోజులు కూడా కాలేదు:
భాజపాకు- శివసేనకు పొత్తు కుదిరి రెండు రోజులు కూడా కాలేదు. అప్పడే ఇరు పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై విరుద్ధ ప్రకటనలు మొదలుపెట్టారు.
మహరాష్ట్ర భాజపా మంత్రి చంద్రకాంత్ పటేల్ మాట్లాడుతూ భాగస్వామ్య పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిన పక్షంలో ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకే లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు.
ముఖ్యమంత్రి పదవిపై అవగాహనకు వచ్చిన తర్వాతే భాజపాతో పొత్తు కుదుర్చురున్నామని శివసేన మంత్రి రామదాస్ అన్నారు. ఒకవేళ ఈ ఒప్పందం అమలు కాకపోతే పొత్తు రద్దు చేసుకుంటామని ఆయన ప్రకటించారు.
అంతకుముందు కార్యకర్తలతో సమావేశమైన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కార్యకర్తలు ప్రతిపాదించిన ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే వారికే ముఖ్యమంత్రి పీఠం అనే విధానాన్ని తిరస్కరించారు. ఈ విధానాన్ని గత 25 సంవత్సరాల నుంచి ఇరు పార్టీలు పాటిస్తున్నాయని, కానీ ఈ సారి పదవి పంచుకునే విధానం ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. భాజపా దీనికి అంగీకరించినందుకే పొత్తు కుదిరిందని ఆయన స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా భాజపా 25 స్థానాల్లో పోటీ చేస్తుండగా, శివసేన 23 చోట్ల బరిలోకి దిగునుంది.