సరిహద్దు రాష్ట్రం జమ్ముకశ్మీర్‌లోని ప్రజలకు ప్రత్యేక హక్కుల్ని కల్పించింది రాజ్యాంగంలోని ఆర్టికల్-35ఏ. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషన్లపై విచారణను ఈనెల 26 నుంచి 28 మధ్య చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
ఆర్టికల్ 35-ఏని నీరుగార్చాలని చూస్తే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.
వేరే జెండా ఎత్తుతారు
కశ్మీర్ ప్రజల హక్కులకు భంగం వాటిల్లితే వారు త్రివర్ణ పతాకాన్ని వీడి వేరే జెండాను ఎత్తాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు మాజీ సీఎం, పీడీపీ పార్టీ అధినేత్రి మహబూబా ముఫ్తీ.
అగ్గి రాజేసినట్టే..
ఆర్టికల్ 35ఏకి మార్పులు చేయాలని చూస్తే కశ్మీర్లో అగ్గి రాజేసినట్లే అవుతుందని హెచ్చరించారు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా. అరుణాచల్ ప్రదేశ్ కంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రత్యేకహక్కులకు భంగం వాటిల్లితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్రాన్ని హెచ్చరించారు.
అన్ని రాజకీయ పార్టీలు తమతో కలిసి రావాలని పీడీపీ, ఎన్సీ పార్టీలు పిలుపునిచ్చాయి.