2014కు ముందు భద్రతా దళాలను నిర్లక్ష్యం చేయడం వల్ల దేశ రక్షణ వ్యవస్థ దెబ్బతిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. గత ప్రభుత్వం దేశం కన్నా కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చేదని, తనకు మాత్రం భారతదేశమే ముఖ్యమని తేల్చిచెప్పారు.
సైనికులకు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని దిల్లీలో జాతీయ యుద్ధ స్మారకం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని స్పష్టం చేశారు. దశాబ్దం ముందే ఈ స్మారక నిర్మాణం జరగాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అమరుల కుటుంబాలకు అన్యాయం చేసిందని ఆరోపించారు.
"తమను తాము భారతదేశ రూపురేఖలను మార్చిన వారిగా భావించే వారు... దేశంలోని వీర పుత్రులకు అన్యాయం చేయడమే కాక... సైనికులు, దేశ రక్షణతో ఆటలాడుకోవడానికి దొరికిన ఒక్క అవకాశాన్నీ వదలలేదు. బోఫోర్స్ నుంచి హెలికాఫ్టర్ వరకు... అన్ని కేసులు ఒక్క కుటుంబంవైపే వేలెత్తి చూపుతాయి. దీనిబట్టి వారి పనితీరు అర్థమవుతుంది. ఇప్పుడు వీరే... దేశానికి రఫేల్ విమానాలు చేరకుండా అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు."
---- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
దేశ రక్షణలో అసాధ్యంగా భావించినవి సుసాధ్యమయ్యాయని ప్రధాని వెల్లడించారు. ఎవరిపైనా ఆధారపడని స్థాయికి భారత సైన్యాన్ని చేర్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.