రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఆర్థిక సాయం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. తొలి విడతగా కోటీ లక్ష మంది రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు బదిలీ చేశారు.
రెండు హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులకు ఆర్థిక సాయంగా ఏడాదికి 6 వేల రూపాయలు అందిస్తామని ఇటీవలే బడ్జెట్లో ప్రకటించింది కేంద్రం.
"రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈరోజు ఉత్తర ప్రదేశ్ పవిత్ర నేల నుంచి దేశంలోని కోట్లాది మంది రైతులకు దీనిని అంకితం చేస్తున్నా. కొద్దిసేపటి క్రితమే 1.01కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మొదటి విడత నగదు జమ చేసే అదృష్టం నాకు దక్కింది. మిగతా రైతులకు కూడా మొదటి విడతగా రూ.2వేలు త్వరలోనే జమచేస్తాం. ఇది ఆరంభం మాత్రమే"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేయాలని మోదీ స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు రైతులకు లబ్ధి చేకూరకుండా దుష్ట రాజకీయలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో రైతులే తగిన బుద్ధి చెబుతారని ప్రధాని అన్నారు.