భారతదేశం ఒక్కటిగా నిలిచి, ఒక్కటిగా ముందడుగేసి, పోరాడి... విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు. దేశ సైనికులపై పూర్తి విశ్వాసం ఉందని ప్రకటించారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.
దేశవ్యాప్తంగా 15వేల ప్రాంతాల్లోని భాజపా కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు మోదీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ అని భాజపా ప్రకటించింది.
దేశంలో అలజడి సృష్టించడానికే శత్రువులు ఉగ్రదాడులు చేస్తున్నారని చెప్పారు మోదీ. దేశాభివృద్ధిని అడ్డుకోవడమే వారి ధ్యేయమని అన్నారు. వారి ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనే బలం దేశానికుందని ప్రధాని స్పష్టం చేశారు.
"ఈ సమయంలో దేశ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వీర సైనికులు సరిహద్దులో, సరిహద్దు అవతల... తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవాళ దేశం మొత్తం ఒక్కటిగా నిలిచి సైనికులకు మద్దతిస్తోంది. సైనికుల సామర్థ్యంపై ఎంతో భరోసా ఉంది. అందుకే వారి మనోబలం దెబ్బతినకుండా చూసుకోవడం ఎంతో అవసరం. మనపై పైచేయి సాధించడానికి మన శత్రువులకు అవకాశం ఇవ్వొద్దు. "
---- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
అవసరాలు.. ఆశలు...
2014 ఎన్నికలు దేశ ప్రజల అవసరాలు తీర్చడానికైతే... వారి ఆశలు నెరవేర్చడానికి 2019 ఎన్నికలని మోదీ వ్యాఖ్యానించారు.
కొంతమంది స్వార్థం కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని... ప్రభుత్వ బలం ఏంటో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు.