లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అధికారులకు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. మార్చి 6న జరగనున్న సమావేశానికి హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోని ఐటీ విభాగ ఛైర్మన్ అనురాగ్ ఠాకుర్ ప్రకటించారు.
"సమావేశానికి ట్విట్టర్ తన ఉన్నతాధికారి కొలిన్ క్రోవెల్ను పంపింది. అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. జవాబు ఇవ్వలేకపోయిన ప్రశ్నలకు రానున్న 10 రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానమిస్తారు. మరొకసారి కమిటీ ఆయనతో సమావేశమవుతుంది. మార్చి 6న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అధికారులు కమిటీ ముందు హాజరవుతారు.
-- అనురాగ్ ఠాకుర్, పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్- ఐటీ.
ట్విట్టర్ ఉన్నతాధికారి కోలిన్ క్రోవెల్‌తో ఠాకుర్ మూడున్నర గంటల పాటు సుధీర్ఘంగా చర్చించారు. అసత్య వార్తలు వంటి సమస్యలను పరిష్కరించడం కోసం ఎన్నికల సంఘంతో కలిసి పనిచేయాలని ట్విట్టర్‌ను కోరారు ఠాకుర్. లోక్‌సభ ఎన్నికల్లో విదేశీయుల జోక్యం ఉండకూడదని తేల్చిచెప్పారు.