ఇప్పటికే లోక్సభలో మధ్యంతర బడ్జెట్, ఆర్థిక బిల్లు, కేటాయింపు బిల్లులు ఆమోదం పొందాయి. దీంతో ఆర్థికశాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా ఈ బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టారు. ముందుగా చర్చించి నిర్ణయించిన మేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మూజువాణి ఓటుతో ఈ బిల్లులు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.
పార్లమెంట్ వ్యవహారాల మంత్రి విజయ్ గోయల్ ప్రవేశపెట్టిన రాష్ట్రపతి ప్రసంగానికీ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షాల సవరణలను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. ఎటువంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో ధన్యవాద తీర్మానం సైతం ఆమోదం పొందినట్లు వెంకయ్య ప్రకటించారు.
బడ్జెట్ ఆమోదంతో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టి పథకాలకు మార్గం సుగమమైంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారి ఆదాయ పన్ను రిబేటు కల్పించడం, చిన్న, సన్నకారు రైతులకు 'పీఎమ్ సమ్మాన్ నిధి పథకం' ద్వారా సంవత్సరానికి రూ.6 వేలు పంట పెట్టుబడి సాయం, అసంఘటిత రంగ కార్మికులకు రూ.6వేలు పెన్షన్ అందించే పథకాలు అమలుకు అవకాశం కలిగింది.
రఫేల్ ఒప్పందం, పౌరసత్వం బిల్లులపై ప్రతిపక్షాల నిరసనలతో 13 రోజుల బడ్జెట్ సమావేశాలు ఎలాంటి చర్చలు జరగకుండానే ముగిసిపోయాయి.