పుల్వామా ఉగ్రదాడిపై పాక్ తొలిసారిగా బదులిచ్చింది. ఇది అత్యంత దిగ్ర్భాంతికర ఘటనగా అభివర్ణించింది. దాడిలో తమ ప్రమేయం ఉందన్న వాదనలను అంతే గట్టిగా తిరస్కరించింది పాక్.
ఎలాంటి దర్యాప్తు లేకుండానే తమను దోషులుగా చిత్రీకరించడం సబబు కాదని పేర్కొంది. భారత మీడియా, ప్రభుత్వం తమపై ఆరోపణలు చేయడం మానుకోవాలని పాక్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
జమ్ము పుల్వామాలోని భారత సీఆర్పీఎఫ్ జవాన్ల వాహణశ్రేణిపై ఆత్మాహుతి దాడి జరిపింది జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఈ దాడిలో దాదాపు 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు.
''ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినా పాక్ ఖండిస్తుంది. విచారణ లేకుండానే భారత్లో జరిగిన ఉగ్రదాడిలో తమ ప్రమేయం ఉందనడాన్ని గట్టిగా తిరస్కరిస్తున్నాం.''
- విదేశాంగ శాఖ ప్రతినిధి మహమ్మద్ ఫైజల్.