పుల్వామా ఉగ్రదాడితో పాకిస్థాన్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా జైపూర్ జైల్లో పుల్వామా దాడికి అనుకూలంగా నినాదాలు చేసి ఓ పాక్ జాతీయుడు తోటి ఖైదీలను రెచ్చగొట్టాడు. ఆగ్రహించిన ఖైదీలు బండరాయితో మోది పాక్ ఖైదీని చంపేశారు.
ఉగ్రదాడి జరిగిన సమయంలో టీవీలో వార్తలు చూస్తూ షకీరుల్లా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. ఇన్ని రోజులుగా సమయం కోసం చూసిన ఇతర ఖైదీలు అవకాశం రాగానే దాడికి పాల్పడ్డారు. అక్కడిక్కడే మృతి చెందినట్టు రాజస్థాన్ డీజీపీ కపిల్ గార్గ్ తెలిపారు. కారాగారం ఆవరణలోనే శవ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. గతేడాది సెప్టెంబరులోనూ షకీరుల్లాపై దాడి జరగటం గమనార్హం.
ఇదీ చూడండి:'ఉగ్ర'దేశాలపై ఐక్యపోరు
షకీరుల్లా పాకిస్థాన్ పంజాబ్‌లోని సియాల్కోట్కు చెందిన వ్యక్తి. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడని 2010లో ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) షకీరుల్లాను అరెస్టు చేసింది. 2011 నుంచి షకీరుల్లాకు ప్రత్యేక గదినే కేటాయించారు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2017 నవంబర్ 30న కోర్టు తీర్పునిచ్చింది.