భారత ప్రభుత్వం వైమానిక దాడులు చేసిందన్న ప్రకటనల్ని కొట్టిపారేసింది పాక్ ప్రభుత్వం. దాడి జరిగిన కొద్ది గంటల అనంతరం ఇస్లామాబాద్‌లో నిర్వహించిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చూడండి: తల వంచేది లేదు
భారత ప్రభుత్వం మళ్లీ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు ఇమ్రాన్. భారత ఆరోపణలు పూర్తిగా కల్పితమని స్పష్టం చేశారు. దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోన్న భారత్‌కు సరైన సమయంలో సరైన బదులిస్తామని ప్రకటించారు.
''జాతీయ భద్రతా కమిటీ భారత్ ఆరోపణల్ని గట్టిగా తిరస్కరిస్తోంది. బాలాకోట్ శిబిరంలో ఎలాంటి దాడులు జరగలేదు. ప్రాణ నష్టం వాటిల్లలేదు. మరొక్కసారి భారత ప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తించింది. ఆరోపణలు పూర్తిగా కల్పితం.''
-జాతీయ భద్రతా సమావేశం అనంతరం ఇస్లామాబాద్ నుంచి ప్రకటన
దేశ భద్రతా దళాల్ని, ప్రజలను అన్నింటికీ సిద్ధంగా ఉంచాలని పాక్ ప్రధాని పిలుపునిచ్చారు. దాడి జరిగిన ప్రదేశాన్ని స్వయంగా చూసి వాస్తవాలు తెలుసుకోవాలని ప్రపంచ మీడియాను ఆహ్వానించారు.
ఎన్నికల సమయానికి ముందు తమ దేశ రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఈ చర్యకు ఉపక్రమించిందని ఆరోపించింది పాక్. శాంతి, స్థిరత్వాన్ని ప్రమాదంలో పడేసిందని వ్యాఖ్యానించింది.
అత్యవసర సమావేశం....
జాతీయ భద్రతా కమిటీ భేటీ అనంతరం పార్లమెంట్ ఉభయ సభ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది పాక్. జాతీయ కమాండ్ అథారిటీ ప్రత్యేక సమావేశాన్ని అత్యవసరంగా బుధవారం నిర్వహించాలని ఇమ్రాన్ సూచించారు.
భారత్‌పై ఒత్తిడి తెచ్చేలా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలన్నది పాక్ ఆలోచనగా తెలుస్తోంది.
ఇవీ చూడండి:
ఐరాసకు పాక్...
నియంత్రణ రేఖ దాటి భారత్ వైమానిక దాడులు జరిపిందన్న పాక్ ఈ అంశాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లనుంది. ఐక్యరాజ్యసమితితో పాటు, ఇతర అంతర్జాతీయ సంఘాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించనుంది.
ఇమ్రాన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.