ఉద్విగ్న భరితంగా..
నాలుగు రోజుల కేసు విచారణలో సోమవారం నాడు హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పుల్వామాలో పాక్ ఆధారిత 'జైష్ ఏ మహమ్మద్' ఉగ్రదాడిలో 41 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది.
భారత్ వాదన..
ఉగ్రవాదం, గూఢచర్యం కేసులో పాక్ మరణశిక్ష విధించిన కుల్ భూషణ్ జాదవ్‌ను వెంటనే విడుదల చేసేలా పాకిస్థాన్‌ను ఆదేశించాలని 'ఐసీజే'కు భారత్ విజ్ఞప్తి చేసింది. అసత్య ఆరోపణలతో, విచారణలో కనీస ప్రమాణాలు పాటించకుండా జాదవ్‌కు ఉరిశిక్ష విధించిందని భారత్ వాదించింది.
ఐసీజేలో సోమవారం జరిగిన విచారణలో భారత్ తరపున సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో పాకిస్థాన్ 'వియన్నా ఒప్పందాన్ని' ఉల్లంఘించిందన్నారు. జాదవ్‌ను తమ రాయబారులు కలుసుకోవడానికి సైతం వీలు కల్పించలేదన్నారు. ఆయనపై మోపిన అభియోగాలనూ వెల్లడించలేదని వాదించారు.
మళ్లీ వక్రబుద్ధి చూపించిన పాక్..
దీనిపై స్పందించిన పాకిస్థాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహమూద్ ఫైసల్ భారత్ వాదనలో కొత్తదనం ఏమీలేదంటూ సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశారు. హుస్సేన్ ముబారక్ పాటిల్ పేరుతో నకిలీ పాస్‌పోర్ట్ సహాయంతో జాదవ్ పాక్‌లో ప్రవేశించాడని ఆరోపించారు. జాదవ్ భారత నౌకాదళ మాజీ అధికారిగా రుజువుచేసే విధంగా కనీసం పెన్షన్ పుస్తకంగానీ, బ్యాంక్ స్టేట్మెంట్గానీ భారత్ సమర్పించలేదని ఆయన అన్నారు.
జాదవ్ నిర్దోషి అని, అతడిని విడిచిపెట్టాలని భారత్ కోరుతోంది. అయితే అతని విద్రోహ, తీవ్రవాద చర్యల వల్ల మరణించిన వేల మంది ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో చెప్పడంలేదని ఫైసల్ ప్రశ్నించారు. ఈ విషయంపై ఐసీజే ఎదుట పాక్ తన వాదనను మంగళవారం వినిపిస్తుందని ఆయన తెలిపారు. అయితే జాదవ్ కేసు విచారణ ఈ నెల 21 వరకు జరగనుంది.
జరిగింది ఏమిటంటే...
ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై జాదవ్‌ను పాక్ సైన్యం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అదుపులోకి తీసుకుంది. అనంతరం 2017లో మిలిటరీ కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 10మంది సభ్యుల అంతర్జాతీయ న్యాయస్థానం 2017 మే 18న పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన శిక్షను నిలుపుదల చేసింది. వేసవికాలంలో ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం ఉంది.