జమ్మూకశ్మీర్ పుల్వామాలో 'జైష్ ఏ మహమ్మద్' జరిపిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవానులు మృతి చెందిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
పాకిస్థాన్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ భారత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుల్వామా దాడిపై ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా, కనీస ఆధారాలు చూపకుండా భారత్ తమను నిందిస్తోందని విమర్శించారు.
"పాక్ యుద్ధాన్ని కోరుకోవడంలేదు. భారత ప్రభుత్వమే యుద్ధ సంకేతాలు పంపుతోంది. ఏ మాత్రం ఆలోచించకుండా, ఎలాంటి ఆధారాలు చూపకుండా మమ్మల్ని నిందించడం సరికాదు. ఇప్పుడు మేము మాట్లాడాల్సిన సమయం వచ్చింది. యుద్ధమే వస్తే దీటుగా బదులిచ్చే సత్తా మాకుంది."
-గఫూర్, పాకిస్థాన్ మేజర్ జనరల్
దేశ విభజన జరిగి 72 సంవత్సరాలు పూర్తయినా తమను ఇంకా స్వతంత్ర దేశంగా భారత్ గుర్తించలేకపోతోందని గఫూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నయా పాకిస్థాన్...
‘1998 న్యూక్లియర్ ప్రయోగం తర్వాత పాక్ ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని భారత్ అసత్య ప్రచారం చేసిందని గఫూర్ ఆరోపించారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన 'నయా పాకిస్థాన్' మాటలను గఫూర్ ఉటంకించారు. పాక్‌లో ఏదైనా ముఖ్య కార్యక్రమం జరుగుతోన్న సమయంలోనే భారత్‌లో ఏదో అలజడి చెలరేగుతుందని విమర్శించారు.
ఎవరికి ప్రయోజనం?
పాక్‌లో జరుగుతోన్న అభివృద్ధి, విదేశీ ప్రతినిధుల పర్యటనలు, పెట్టుబడులను భారత్ ఎన్నడూ చూసి ఉండదని గఫూర్ ఎద్దేవా చేశారు. చైనా, రష్యా, అమెరికా దేశాలు తమతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం పుల్వామా దాడిని భారత నేతలు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని గఫూర్ విమర్శించారు. పుల్వామా దాడితో పాకిస్థాన్‌కు ఏ ప్రయోజనం కలుగుతుంది? ఈ దాడి వల్ల ఎవరికి లాభమో మీరో ఆలోచించుకోండి అని గఫూర్ ప్రశ్నించారు.