తమ పోరాటం ఉగ్రవాదంపైనే తప్ప కశ్మీరీలపై కాదని స్పష్టంచేశారు ప్రధాని నరేంద్రమోదీ. వేర్వేరు చోట్ల కశ్మీరీలపై దాడుల నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ టోంక్‌లో భాజపా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. పుల్వామా దాడి కారకుల భరతం పట్టితీరతామని తేల్చిచెప్పారు.
'జమ్ముకశ్మీర్‌లోని వేర్పాటువాదులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. జవాన్లపై విశ్వాసం ఉంచండి. అన్ని లెక్కలు సరిచేస్తాం' అని మోదీ అన్నారు.
పాక్ ప్రధానితో ఫోన్ సంభాషణ ప్రస్తావన
పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని. తనకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇమ్రాన్ నిలుపుకుంటారో లేదో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
"మన పోరాటం ఉగ్రవాదులపైన, మానవతా వ్యతిరేకవాదులపైన. మన పోరాటం కశ్మీర్ కోసం. కశ్మీర్‌పై కాదు. కశ్మీర్ ప్రజలపై కాదు. కొద్దిరోజులుగా జరుగుతున్న సంఘటనలు చిన్నవా పెద్దవా అన్నది ముఖ్యం కాదు. ఇలాంటి ఘటనలు జరగకూడదు. కశ్మీర్ విద్యార్థులూ తీవ్రవాదుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉగ్రవాదంపై మనతో కలిసి పోరాడేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. మనమూ వారికి అండగా ఉండాలి.
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రధాని క్రికెటర్‌గా అందరికీ తెలిసిన వ్యక్తి. రాజకీయాలపై అవగాహన ఉన్న వారు. క్రీడా రంగం నుంచి వచ్చిన వ్యక్తి. భారత్-పాక్ కలిసి పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలించేందుకు ముందుకు సాగాలని ఆరోజే ఆయనకు చెప్పాను. వారు నా మాటలకు బదులిచ్చారు. మోదీ గారూ... నేను పఠాన్ కుటుంబానికి చెందిన వ్యక్తిని, నిజాలే చెప్తాను, చెప్పింది తప్పక చేస్తాను అని అన్నారు. పాక్ ప్రధాని చెప్పిన మాటలను నిలబెట్టుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. వారు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉంటారో లేదో చూస్తా"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి