దిల్లీలో నేడు జరిగే ప్రతిపక్ష పార్టీల నేతల భేటీ అజెండా మారింది. ముందుగా అనుకున్నట్టు ఉమ్మడి కార్యాచరణ రూపకల్పనపై కాకుండా... పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన మెరుపుదాడులపై ప్రధానంగా చర్చించనున్నారు ప్రతిపక్షాల నేతలు. ఉమ్మడి కార్యాచరణ అంశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ విషయన్ని ఓ సీనియర్ నేత ధ్రువీకరించారు. అజెండా మారడం వల్ల వామపక్షాలు కూడా భేటీలో పాల్గొననున్నాయి.
ప్రతిపక్షాల భేటీకి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్‌బంగ, దిల్లీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితర పార్టీల నేతలు హాజరుకానున్నారు.
సందిగ్ధంలో కాంగ్రెస్
కాంగ్రెస్ నేతృత్వంలోనే ప్రతిపక్షాల భేటీ జరగాల్సి ఉంది. అయితే ఉగ్రశిబిరాలపై మెరుపుదాడులతో పరిస్థితి మారింది. భేటీలో పాల్గొనాలా.. వద్దా అనే సందిగ్ధంలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ. మెరుపుదాడి జరిగిన ఒకరోజులోనే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తోంది.
మమతా బెనర్జీ రచించిన పుస్తకావిష్కణ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.