దేశంకోసం సరిహద్దులో ప్రాణాలర్పించిన సైనికులకు ఎన్నో విధాలుగా నివాళులర్పిస్తాం. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి అండగా నిలబడతాం. కానీ, ఇటీవల పుల్వామా ఉగ్రదాడి ఘటనపై రాజస్థాన్‌కు చెందిన యువకుడు గోపాల్ సహరన్ చలించిపోయాడు. ఎంతలా అంటే అమరులైన సైనికుల పేర్లు చెరిగిపోకుండా తన శరీరంపై పచ్చబొట్టు వేసుకునేంతలా.!
రాజస్థాన్ బికనేర్ జిల్లా శ్రీదుంగర్గఢ్ పట్టణంలో నివాసముంటున్న గోపాల్ సహరన్ పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పేర్లను తన ఒంటిపై పచ్చబొట్టుతో లిఖించుకున్నాడు. వీళ్లతోపాటు సరిహద్దు రక్షణలో అమరులైన మొత్తం 71 మంది జవాన్ల పేర్లను వీపుపై టాటూగా వేసుకున్నాడు సహరన్. 'భగత్ సింగ్ యూత్ బ్రిగేడ్'లో సభ్యుడైన సహరన్ సైనికులపై ఈరకంగా అభిమానం ప్రదర్శించి తన దేశభక్తిని చాటుకున్నాడు.