రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సంఖ్య గతంలో కంటే ఎందుకు తగ్గిందనే విషయంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. 126 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని భారత్ 2001లో నిర్ణయించిందని, అయితే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని శనివారం ఓ సదస్సులో రక్షణ మంత్రి వివరించారు.
"2001లో భారత వాయుసేన 126 యుద్ధ విమానాలు కావాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం వారి నిర్ణయం మారింది. ఈ మార్పు ఇష్టానుసారంగా తీసుకున్నది కాదు. మారుతున్న ప్రపంచ స్థితిగతులు కూడా ఈ నిర్ణయం తీసుకోవడంలో ముఖ్య భూమిక పోషించాయి. వారు (కాంగ్రెస్) చెబుతున్న 126 సంఖ్య ఎప్పటికీ అలానే ఉండిపోదు, కాలానుగుణంగా మారుతుంటుంది. వాయుసేనకు ఎన్ని విమానాలు అవసరమైతే అన్నీ ఏర్పాటు చేస్తాం."
-నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి