పౌరసత్వ చట్ట సవరణ బిల్లును తాము ఎప్పటి నుంచో వ్యతిరేస్తున్నామని నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అధినేత, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాద్ ఏ సంగ్మా ఈటీవీ భారత్ ముఖాముఖిలో మరోసారి స్పష్టం చేశారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన మరుక్షణమే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతామని తేల్చి చెప్పారు. ఈ బిల్లు ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని తెలిపారు సంగ్మా.
రాజ్యసభలో చర్చించే అంశాల జాబితాలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును పొందుపరచలేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ బిల్లును ఎగువసభలో ఆకస్మికంగా ప్రవేశపెట్టే అవకాశముందని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసోం గణ పరిషత్(ఏజీపీ) ఎన్డీఏ కూటమి నుంచి ఇదివరకే తప్పుకుంది.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ పార్టీల మద్దతు కోరుతున్నాయి. దిల్లీలో ప్రముఖ రాజకీయ నాయకులను సంప్రదిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల నాయకులు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఇదివరకే స్పష్టం చేశారు.