పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లకు సందేశం పంపారు. పాశవిక ఘటనను తీవ్రంగా ఖండించారు.
''దాడికి బాధ్యులైన వారికి కఠిన శిక్ష విధించాలి. ఈ కుట్ర పన్నినవారు, అమలుపర్చిన వారెవ్వరూ తప్పించుకోలేరు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు మా దేశం సిద్ధంగా ఉంది.''
- పుతిన్, రష్యా అధ్యక్షుడు
కశ్మీర్ ఘటనతో షాక్‌కు గురయ్యాం. బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో మేం భారత్‌వైపే ఉంటాం.
- యూకే విదేశాంగ కార్యదర్శి
అమెరికాలోని శ్వేతసౌధం నుంచి పుల్వామా ఘటనపై ఒక ప్రకటన వెలువరించింది. ఉగ్రవాద నిరోధక పోరాటంలో భారత్‌కు సహకరిస్తామని తెలిపింది.
''అన్ని ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ తన మద్దతును తక్షణమే ఉపసంహరించుకోవాలి. వారికి ఎలాంటి సాయం అందించకూడదు.''
- శ్వేతసౌధ ప్రకటన
ఆస్ట్రేలియాలోని రాజకీయ నేతలు ఈ ఘటనను హేయమైన చర్యగా పేర్కొన్నారు.
- ''పుల్వామా దాడిలో మృతిచెందిన జవాన్ల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. భారత ప్రజలవైపే ఉంటాం.'' - ఆస్ట్రేలియా రాజకీయ నేతలు
- ఇదొక పిరికిపంద చర్య. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్‌కు మా మద్దతు ఉంటుంది. - సౌదీ అరేబియా
- ఈ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. హింస, ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాల్సిందే. -యూఏఈ
ఉగ్రవాదుల చర్యతో ఎంతోమంది సాయుధ సిబ్బందిని కోల్పోయిన అఫ్గానిస్థాన్ భారత్‌తో కలిసి పోరాడుతామని ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో దేశాల మధ్య సమన్వయం ఉండాలని పిలుపునిచ్చింది.
వీటితో పాటు మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా, గ్రీస్, సౌతాఫ్రికా, పోర్చుగల్, కొరియా, ఇండోనేసియా, సింగపూర్ దేశాలు దాడిని ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి.