లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో పోటీ చేయటానికి జట్టుకట్టిన ఎస్పీ-బీఎస్పీ కూటమిపై సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. తన కుమారుడు అఖిలేశ్ యాదవ్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీకి సగం సీట్లను బీఎస్పీతో పంచుకోవటంపై ప్రశ్నించారు.
ఎస్పీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ములాయంసింగ్. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే తనను కలవాలని సూచించారు. అఖిలేశ్ తీసుకునే నిర్ణయాలను మార్చే అధికారం తనకు ఉందన్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఎస్పీ-బీఎస్పీ చేరో 38 సీట్లలో పోటీ చేస్తుందని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఎస్పీ 37, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి.
" పార్టీని ఎలా గెలిపించాలో నా గతం చూస్తే తెలుస్తుంది. పార్టీ బలంగా ఉన్నప్పుడు పొత్తులకు ఎందుకు వెళ్లినట్లు. మన ముందు ఒక లక్ష్యం ఉంది. మన పార్టీ ఎక్కువ సీట్లు సాధించాలని నేను కోరుకుంటున్నా." - ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ వ్యవస్థాపకులు
భాజపా ఎన్నికల సన్నద్ధత బాగుందని కితాబిచ్చారు ములాయం. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు.