దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. దక్షిణ కొరియా అధ్యక్షుడి అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది.
వాణిజ్యం, రక్షణ, భద్రత, పెట్టుబడి రంగాల్లో సహాయ సహకారాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు.
ఇరు దేశాల మైత్రి, వ్యాపార సంబంధాలు ధృఢంగా కొనసాగుతూ... 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల మార్కును అందుకోవాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణశాఖలో పలు అవగాహన ఒప్పందాలపై మోదీ, మూన్ సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడతామని స్పష్టం చేశారు.
"భారతీయ హోంశాఖ- కొరియా పోలీసు వ్యవస్థల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ఉగ్రవాదం నిర్మూలనకు తోడ్పడుతుంది. ఇరు దేశాల బలపడుతున్న మైత్రిలో రక్షణశాఖకు ముఖ్య పాత్ర ఉంది. భారత సైన్యం వద్ద ఉన్న కే-9 వజ్ర ఆయుధమే ఇందుకు ఉదాహరణ."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
యుద్ధ వీరులకు మోదీ నివాళి...
సియోల్‌లోని జాతీయ స్మారకాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. కొరియా యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
రెండు రోజుల పర్యటన కోసం గురువారం దక్షిణ కొరియా చేరుకున్నారు మోదీ. తొలిరోజు భారత్-కొరియా వ్యాపార సమావేశంలో పాల్గొన్న మోదీ... రెండో రోజు ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. అనంతరం సియోల్ శాంతి బహుమతి అందుకోనున్నారు.