ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రంతా నిద్రపోకుండా.. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపుదాడులను పర్యవేక్షించినట్టు సమాచారం. మిరాజ్ యుద్ధ విమాన పైలట్లు సురక్షితంగా భారత భూ భాగంలోకి వచ్చారని తెలిసేంత వరకు ఆయన కంట్రోల్రూంలోనే ఉన్నారు.
రాత్రి 9.15 నుంచి...
సోమవారం రాత్రి 9.15 కల్లా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ... మెరుపు దాడులను పర్యవేక్షిస్తున్న కంట్రోల్‌కు పది నిమిషాల్లో చేరుకున్నారు. అప్పటి నుంచి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, వాయుసేనాధిపతి బిఎస్ ధనోవాలతో మెరుపుదాడులపై ఎప్పటికప్పుడు మాట్లాడారు. వివరాలు తెలుసుకుంటూ సలహాలు, సూచనలు ఇచ్చారు. మెరుపుదాడులు పూర్తయిన తర్వాత.. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అందరినీ అభినందించారు ప్రధాని మోదీ. పైలట్లు తిరిగి సురక్షితంగా వచ్చారని తెలిశాకే కంట్రోల్ రూం నుంచి బయలుదేరారు.
రోజంతా బిజీబిజీ
మంగళవారం తెల్లవారుజామున కంట్రోల్ రూం నుంచి బయటకు వచ్చిన ప్రధాని... రోజువారీ కార్యక్రమాల కోసం బయలుదేరారు. ఉదయం పది గంటలకే ఆయన నివాసంలో కేబినేట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.
అనంతరం రాజస్థాన్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. తిరిగి దిల్లీ వచ్చిన ప్రధాని ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.