నాలుగేళ్ల కాలంలో భారత్కు 250 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) వచ్చాయని ప్రధాని మోదీ తెలిపారు. సులభతర వాణిజ్య విధానంలో భారతదేశం 77వ స్థానానికి చేరుకుందని దక్షిణ కొరియాలో జరిగిన భారత్- కొరియా వ్యాపార సమావేశంలో ప్రధాని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలోగా తొలి 50 ర్యాంకుల్లో భారత్ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
600లకు పైగా కొరియా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాయని మోదీ గుర్తు చేశారు. మరిన్ని సంస్థలు భారత్లో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా- భారత్ మైత్రిపై ప్రధాని స్పందించారు.
"అవకాశాలు అందించే స్థాయికి భారత్ ఎదిగింది. మేము భారతదేశ ఆకాంక్షలు నెరవేర్చేందుకు పని చేస్తున్నాం. అలాంటప్పుడు ఒకే రకమైన ఆలోచనలు ఉన్న వారితో భాగస్వామ్యులుగా ఉండాలని కోరుకుంటాం. వారిలో దక్షిణ కొరియా ఎంతో ముఖ్యమైనదని మా అభిప్రాయం. ఆర్థిక వ్యవస్థలో 5 లక్షల కోట్ల డాలర్ల మార్కు అందుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. మరే ఇతర దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతి ఏడాదీ 7శాతం వృద్ధితో ముందడుగు వేయట్లేదు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.