వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని... పార్టీ కన్నా దేశం గొప్పదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దేశానికి మించింది మరొకటి లేదని స్పష్టంచేశారు. పాక్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడుల అనంతరం రాజస్థాన్ చురు ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. భరతమాతను తలొగ్గనివ్వకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
"ఇవాళ ఎంతో ముఖ్యమైన రోజు. ఈరోజు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నమస్కరించాలి. శిరస్సు వంచి నమస్కరించాలి. భారతదేశం సురక్షిత హస్తాల్లో ఉందని దేశ ప్రజలకు నేను స్పష్టం చేస్తున్నా. దేశానికి ఎలాంటి ఇబ్బంది రానివ్వను. భరతమాత తలొగ్గకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నా."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
చురు ర్యాలీలో కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు మోదీ. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు అందకుండా రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. రైతులకు పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న పథకాలపై కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
"కేంద్ర ప్రభుత్వ పథకం కోసం రాజస్థాన్ ప్రభుత్వం నుంచి అందాల్సిన రైతుల జాబితా ఇంకా అందలేదు. రైతుల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేసే పథకాలకు అడ్డుపడకూడదని, రైతులను కష్టపెట్టకూడదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాజస్థాన్ చురు నేల నుంచి అభ్యర్థిస్తున్నా."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.