సియోల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మోదీ విజయాలపై ఓ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
ప్రపంచ దేశాల మధ్య సహకారం పెంపు, ఆర్థిక వృద్ధికి కృషి చేసినందుకు గాను సియోల్ శాంతి పురస్కార కమిటీ ఆయను ఆవార్డుతో సత్కరించింది.
భారత, ప్రపంచ ఆర్థిక వృద్ధి కోసం మోదీ చేసిన కృషిని మోదీనమిక్స్గా సంబోధించారు అవార్డు కమిటీ సభ్యులు. ధనిక, పేద వర్గాలకు మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేందుకు మోదీ ఎంతగానో కృషి చేశారన్నారు.
ప్రపంచ శాంతికి ఇతర దేశాల నాయకులతో కలసి మోదీ తీసుకున్న విధాన నిర్ణయాలను అవార్డు కమిటీ ప్రత్యేకంగా కొనియాడింది.
14వ సియోల్ శాంతి
సియోల్ శాంతి పురస్కారం అందుకున్న 14వ వ్యక్తి ప్రధాని మోదీ. ఐరాస మాజీ చీఫ్ కోఫీ అన్నన్, జర్మనీ మాజీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ సహా డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ తదితరులు అంతకు ముందు సియోల్ శాంతి పురస్క్రారాన్ని స్వీకరించిన వారిలో ఉన్నారు.
1988లో సియోల్లో ఏర్పాటు చేసిన 24వ ఒలింపిక్స్ విజయమంతమవడాన్ని పురస్కరించుకుని 1990ల నుంచి ప్రకటిస్తున్నారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనే ఈ అవార్డు ఉద్దేశ్యం.
ప్రపంచ శాంతికి కృషి
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేతులు కలిపి ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
"మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి సమయం వచ్చింది. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చేతులు కలపాలి. ముష్కరుల ఆర్థిక మూలాల్ని.. ఉగ్ర వాద వ్యతిరేక భావజాలం ద్వారా ఎదుర్కొవాలి. విద్వేషాన్ని, ప్రేమతో... వినాశనాన్ని అభివృద్ధితో... హింసను శాంతితో ఎదుర్కోవాలి. ఉగ్రవాదం ప్రస్తుతం విశ్వవ్యాప్తమయింది. ప్రపంచ శాంతికి. భద్రతకు విఘాతంగా మారింది" -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి