ఎన్నేళ్లు విదేశీయుల పాలనలో ఉన్నా... స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహోన్నతుల వల్లే... భారతీయ సంస్కృతి చెక్కుచెదరలేదని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మన దేశ సంస్కృతి అజరామరమని చెప్పారు. రవీంద్రుడి రచనలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయని తెలిపారు. ఠాగూర్ సాంస్కృతిక సామరస్య పురస్కార ప్రదానోత్సవంలో మోదీ ప్రసంగించారు.
మణిపూరి నృత్యకారుడు రాజ్‌కుమార్ సింఘాజిత్ సింగ్‌కు, బంగ్లాదేశీ సాంస్కృతిక సంఘం ఛాయనౌత్కు, ప్రముఖ శిల్పి రామ్ వంజికు ఠాగూర్ పురస్కారాలను అందించారు మోదీ.
భారత్ దేశ సంస్కృతికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉందని మోదీ గుర్తు చేశారు.
"సంస్కృతి దేశానికి ప్రాణవాయువు లాంటిది. దాని వల్లే దేశానికి ప్రత్యేక గుర్తింపు, శక్తి లభిస్తుంది. ఏ దేశానికైనా గౌరవం... సంస్కృతిలో పరిపక్వత వల్లే పెరుగుతుంది. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర గల సంస్కృతి భారత్ సొంతం. ఎన్నో ఏళ్లు పరాయి పాలనలో ఉన్నా... దేశంపై ఎలాంటి ప్రభావం పడకుండా మహనీయులు కాపాడారు. దీని వెనుక స్వామి వివేకానంద, గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ఎందరో మహానుభావుల పాత్ర ఉంది."
--- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.