పాకిస్థాన్‌లోని 'జైష్ ఏ మహమ్మద్' ఉగ్రవాద తండాలను భారత వైమానిక దళానికి చెందిన 'మిరాజ్ 2000' యుద్ధ విమానాలు తునాతునకలు చేశాయి. 1971 తరువాత పాక్ భూభాగంపై మొదటిసారిగా జరిపిన ఈ లక్షిత దాడులకు 'మిరాజ్ 2000'ను భారత్ ప్రయోగించడం విశేషం.
అయితే ఈ మెరుపు దాడులను గ్వాలియర్ నుంచే నేరుగా చేపట్టారా? లేదా మరో చోటు నుంచి చేపట్టారా? అనేది వెల్లడికాలేదు.
జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. ఈ దాడికి తామే బాధ్యులమని పాక్ కేంద్రంగా పనిచేసే 'జైషే మహ్మద్' ప్రకటించుకుంది. భారత్ ప్రతీకార దాడి చేసి ఉగ్రతండాలను నామరూపాలు లేకుండా చేసింది.
మిరాజ్ 2000 విశిష్టత...
భారత్ చేపట్టిన మెరుపు దాడులకు 'మిరాజ్ 2000' యుద్ధాలను ఉపయోగించడానికి ప్రధాన కారణం... లక్ష్యాలను గురితప్పకుండా నాశనం చేయగల సామర్థ్యం.
ఫ్రెంచ్ కంపెనీ 'డసో ఏవియేషన్' మిరాజ్ 2000 యుద్ధ విమానాలను రూపొందించింది. ప్రస్తుతం గ్వాలియర్‌లో మూడు స్క్వాడ్రన్ల మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఒకే ఇంజన్‌తో పనిచేసే ఈ బహుళసాధక యుద్ధ విమానాలు క్షిపణులు, బాంబులను, లేజర్ గైడెడ్ బాంబులను ప్రయోగించగలవు. వీటిలోని 'థేల్స్ ఆర్డీవై 2 రాడార్' 100 శాతం కచ్చితత్వంతో సుదూర శత్రు లక్ష్యాలను గుర్తించగలవు.
ఇంతటి శక్తి సామర్థ్యాలు గల ఈ మిరాజ్ యుద్ధ విమానాలు 30 సంవత్సరాల క్రితమే భారత అమ్ముల పొదిలో చేరాయి. వీటిని రూ.20 వేల కోట్ల రూపాయలతో ఆధునికీకరిస్తున్నారు.