పుల్వామా దాడిలో 40మంది సైనికుల మృతికి భారత్ మార్కు స్పందన మొదలైంది. భారత వాయుసేన ఎల్ఓసీ సమీపంలోని పీఓకేలో జైషే ఉగ్రక్యాంపులపై దాడి చేసింది. దాడికి మిరాజ్-2000 యుద్ధ విమానాల్ని ఎంచుకుంది భారత్. 12 మిరాజ్ యుద్ధ విమానాలు ఒక బృందంగా ఏర్పడి జైషే క్యాంపులపై 1000కిలోల ప్రమాణంలో 10 బాంబుల్ని వదిలాయి. పీఓకేలో భారత్ చేసిన మొట్టమొదటి వాయుదాడి ఇదే. ఈ మెరుపు దాడిపై అత్యంత గోప్యత పాటించింది భారత్.
మిరాజే ఎందుకు?
వాయుసేన వద్ద సుఖోయ్ సూ-30 ఎమ్కేఐ, మిగ్-29, తేజస్ ఎల్సీఏ వంటి యుద్ధ విమానాలు ఉండగా దాడులకు మిరాజ్‌నే ఎంచుకుంది. 1985లో వాయుసేనలోకి ప్రవేశించిన మిరాజ్ విమానానికి వజ్ర అని నామకరణం చేశారు.
⦁ మిరాజ్‌ను ఫ్రాన్స్ కంపెనీ డసో ఏవియేషన్ దీనిని తయారు చేసింది.
⦁ నాలుగో తరానికి చెందిన మిరాజ్ ఒకే ఇంజిన్ సామర్థ్యంతో మల్టీరోల్ ఆపరేషన్స్ చేయగలదు.
⦁ ఈ యుద్ధ విమానాన్ని తొమ్మిది దేశాలు వినియోగిస్తున్నాయి.
⦁ మిరాజ్-2000 యుద్ధ విమానాల్లో ఆరు రకాలైన ఫైటర్ జెట్లు ఉన్నాయి. మిరాజ్-2000సీ, 2000-బీ, 2000-డీ, 2000-ఎన్, 2000-5ఏ, 2000-ఈ విమానాలు వివిధ దేశాల వాయుసేనల్లో తమ సామర్థ్యాల్ని నిరూపించుకున్నాయి.
⦁ ఉపరితలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి గగనతలంలో పోరాడగలవు.
⦁ రఫేల్ యుద్ధ విమానాల్ని ఉత్పత్తి చేస్తున్న డసో కంపెనీనే మిరాజ్‌ను తయారుచేసింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి హర్షం...
ఈ వాయుదాడులపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం తాను, తన పార్టీ త్రివిధ దళాలకు మద్దతుగా నిలుస్తుందన్నారు.