జైషే మహ్మద్ స్థావరాలే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున భారత్ సైన్యం వైమానిక దాడులు చేసిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రకటించారు. ఈ మెరుపు దాడిలో పెద్ద సంఖ్యలో జైషే మహ్మద్ ఉగ్రవాదులను సైన్యం మట్టికరిపించిందని తెలిపారు. పౌరులకు హాని జరగకుండా ఉండే ప్రాంతాలనే ఎంపిక చేసుకున్నామని వెల్లడించారు.
బాలాకోట్‌లోని అతిపెద్ద జైషే మహ్మద్ స్థావరాన్ని సైన్యం ధ్వంసం చేసిందని తెలిపారు. దాడిలో జైషే మహ్మద్ అగ్రనేతలు హతమయ్యారని వెల్లడించారు.
"దేశంలో జైషే మహ్మద్ మరోసారి ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జీహాదీలు శిక్షణ పొందుతున్నారని అప్రమత్తం చేశారు. ప్రమాదం పొంచి ఉండటంతో ఎదురు దాడి చేయడం ఎంతో అవసరమైంది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్‌లో బాలాకోట్‌లోని అతిపెద్ద జైషే మహ్మద్ స్థావరాన్ని భారత్ ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్స్, ఆత్మహుతి దాడికి పాల్పడటానికి శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో హతమయ్యారు."
విజయ్ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి
పాక్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఈ నెల 14న పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడిందని విజయ్ గోఖలే చెప్పారు. ఈ ఆత్మహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు చోటివ్వమని 2004 జనవరిలోనే పాకిస్థాన్ ప్రకటించిందని విజయ్ గోఖలే ఉద్ఘాటించారు. పాక్ తన మాటలకు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. జైషే మహ్మద్ స్థావరాల నిర్మూలనకు పాక్ తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
"జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ బావ మౌలానా యూసఫ్ అజర్ (అలియాస్ ఉస్తాద్ ఘౌరి) నేతృత్వంలో బాలాకోట్ స్థావరంలోని జీహాదీలు శిక్షణ పొందుతున్నారు. పీఓకేతోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాల సమాచారం ఆ దేశానికి ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. పాక్ అధికారులకు తెలియకుండా వందల సంఖ్యలో జీహాదీలను తయారు చేసే శిక్షణ శిబిరాలు నడపటం అసాధ్యం" -విదేశాంగ శాఖ కార్యదర్శి
ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.