భారత్, పాకిస్థాన్ దేశాలు సంయమనం పాటిస్తూ, సరిహద్దుల్లో సైనిక చర్యలను నిలిపివేయాలని అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, నేపాల్ సహా పలు దేశాలు సూచించాయి. శాంతిమార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని కోరాయి.
జమ్మూకశ్మీర్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి అక్రమంగా చొరబడడం వల్ల బుధవారం సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాక్ యుద్ధ విమానాలను తిప్పికొట్టింది మన వాయుసేన. పాక్ విమానాలు తోకముడిచి వెనక్కితిరిగి వెళ్లాయి. భారత్‌కు చెందిన ఓ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నామని పాక్ ప్రకటించడం మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూనే ఉన్నాయి.
సంయమనం పాటించాలి : అమెరికా
భారత్, పాక్ విదేశాంగ మంత్రులతో విడివిడిగా మాట్లాడినట్టు తెలిపారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో.
" సంయమనం పాటించాలని భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులకు సూచించాం. ఉద్రిక్త పరిస్థితులు ఎట్టిపరిస్థితుల్లో తీవ్రం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశాం." -- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి
సహకరిస్తాం : రష్యా
భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల వద్ద పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని ప్రకటించింది రష్యా విదేశాంగ శాఖ.
"ఇరు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ, దౌత్యపరమైన చర్చలతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి. ఉగ్రవాదంపై పోరుకు ఇరు దేశాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. " -- రష్యా విదేశాంగ శాఖ
పరిశీలిస్తున్నాం : బ్రిటన్
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు బ్రిటన్ ప్రధాని థెరీసా మే. ఇరు దేశాల పరిస్థితిని ఎప్పటికప్పడు పరిశీలిస్తూనే ఉన్నామని చెప్పారు.
" భారత్, పాక్ దేశాలు సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఇరు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. చర్చలతో దౌత్యపరంగా సమస్యలు పరిష్కరించుకోవాలి." -- థెరీసా మే, బ్రిటన్ ప్రధాని
రాజకీయ, దౌత్య చర్చల ద్వారా ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడం ఉత్తమ మార్గమని సూచించింది మాస్కో.
శాంతికి కృషి చేయాలి : చైనా
భారత్, పాక్ త్వరగా చర్చించుకొని సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరింది చైనా. సంయమనం పాటిస్తూ ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాటుపడాలని చెప్పింది.
ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదు..
భారత్, పాక్ దేశాల మధ్య త్వరలోనే సమస్యలు సమసిపోతాయని ఆకాంక్షించింది ఐరోపా సమాఖ్య. ఉగ్రవాదాన్ని ఏ దేశమైన ఉపేక్షించకూడదని అభిప్రాయపడింది. ఇరు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. సంయమనం పాటించాలని కోరింది.
దాడులు వద్దు
సార్క్ సభ్యదేశంగా భారత్, పాకిస్థాన్‌లను శాంతియుతంగా ఉండాలని నేపాల్ కోరింది. పరస్పర దాడులకు పాల్పడవద్దని సూచించింది.