పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై ప్రతి భారతీయుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడు. ఉగ్రదాడిని ప్రతిఒక్కరు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పుల్వామా ఘటనకు దీటుగా స్పందించాలని దేశ వ్యాప్తంగా ప్రజలందరూ సంకేతాలిచ్చారు. గుజరాత్ సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారులూ అదే బాటలో వెళ్తున్నారు. ఇందుకోసం డిజిటల్ ప్రింటింగ్ సాంకేతికత సాయంతో సరికొత్త చీరను రూపొందించారు.
భారత త్రివిధ దళాల(ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) శక్తిని ప్రతిబింబించేలా చీరలను తయారు చేశారు. అమర వీరుల త్యాగాలు, పోరాటాలు చీరపై కనిపించేలా డిజైన్ చేశారు. పాక్ అక్రమిత కశ్మీర్లో 'లక్షిత దాడులు' ఎలా చేశారన్న విషయాన్ని చీరలో ప్రధానంగా వివరించారు. అందుకే ఈ చీరకు 'లక్షిత దాడుల చీర' అని నామకరణం చేశారు.
లాభనష్టాలు ఆశించకుండా దేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూన ఈ చీరలను విక్రయించనున్నారు. చీరలను అమ్మగా వచ్చిన మొత్తాన్ని పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇస్తామని తెలిపారు. భారత ఆర్మీకి ఈ చీరను అంకితమిచ్చారు రూపకర్తలు.
పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందనే సందేశాన్ని పాకిస్థాన్‌కు పంపేందుకే ఈ చీరలు తయారు చేస్తున్నామని వివరించారు.