మోదీ ప్రభుత్వ వైఫల్యమే జమ్ముకశ్మీర్ పుల్వామాలోని ఉగ్రదాడికి కారణమని ఆరోపించింది కాంగ్రెస్. ఇది కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యమని విమర్శించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.
ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించిన ఆయన దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. జాతీయ భద్రతా విషయంలో అస్సలు రాజీ పడొద్దని తెలిపారు. మోదీ ప్రభుత్వంలో ఇది 18వ అతిపెద్ద ఉగ్రవాద చర్య అని వెల్లడించారు.
''గత 55 నెలల్లో పాకిస్థాన్ దాదాపు 5 వేలసార్లు నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇది గత యూపీఏ హయాంలో కంటే 1000 రెట్లు ఎక్కువ''
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఈ ఉగ్ర దాడి ఉరీ ఘటన కంటే పెద్దదిగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనలో 40మందికి పైగా జవాన్లు మృతిచెందారు.