లోక్సభ ఎన్నికలకు ముందే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రెండు విడతలుగా రూ.4వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.
మధ్యంతర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. ఏడాదికి ఒక్కో రైతుకు మూడు విడతల్లో రూ.6వేలను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పారు. అయిదు ఎకరాల్లోపు భూమి ఉన్న 12కోట్ల మంది చిన్న,సన్నకారు రైతులు ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారని చెప్పారు. మార్చిలోపు తొలి విడత డబ్బును రైతులకు అందజేస్తామని చెప్పారు.
"అర్హులైన రైతులను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. లబ్ధిదారుల జాబితా అతి త్వరలోనే సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు భూ రికార్డులను డిజిటలైజ్ చేశాయి. తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు కిసాన్ యోజన వంటి పథకాలను ఇప్పటికే ప్రకటించాయి. వారి వద్ద కూడా రైతుల సమాచారం ఉంటుంది. " - వ్యవసాయ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి
లోక్సభ ఎన్నికలకు ముందే రెండు విడతలు అనగా రూ.4వేలను అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారి తెలిపారు. ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించినందున అమలుకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని వివరించారు.
లోక్సభ ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరిగే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఎప్పుడైనా ఎన్నికల కోడ్ అమల్లోకి రావచ్చు.