దిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 1 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన ఆయన... రాష్ట్ర హోదా సాధించే వరకు విరమించేది లేదని ఉద్ఘాటించారు.
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. "అధికారాలు లేకపోవటం వల్ల ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వర్తించలేకపోతోంది. ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు లేకపోవటం వల్ల స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దిల్లీ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు" అని అన్నారు.
"దిల్లీ ప్రజలను సంఘటితం చేసేందుకు, రాష్ట్ర హోదా ఆందోళనకు సమాయత్తం చేసేందుకు మార్చి 1 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తాను. రాష్ట్ర హోదా వచ్చేంత వరకు ఆందోళన విరమించను" - కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి.