కశ్మీరీలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 22 నుంచి దేశంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ మేరకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం అటార్నీ జనరల్ సమర్పించిన నివేదికను స్వీకరించింది. ఈ అంశంపై తదుపరి ఆదేశాలు అవసరం లేదని స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలూ వారి నివేదికలు ఒక వారంలోగా సమర్పించాలని ఆదేశించింది.
కశ్మీరీల అంశంపై న్యాయవాది తారిక్ అడీబ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని రెండు వారాల అనంతరం విచారించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
11 రాష్ట్రాలకూ ఆదేశాలు
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో నివాసముంటున్న కశ్మీరీలపై దాడులు జరుగకుండా చూడాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు ఫిబ్రవరి 22న ఆదేశాలు జారీ చేసింది